తెలంగాణ లో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి .పరస్పర విమర్శలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు .ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే ఆరోపణలపై జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కొత్త ప్రభాకర్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారు. నువ్వెంత నీ బ్రతుకెంత? వ్యక్తిత్వంలో నా వెంట్రుకతో సమానం నువ్వు ” అని తిట్టిపోశారు.తాను ప్రభాకర్ రెడ్డి మాదిరిగా ప్యాకేజీ లీడర్ కాదని, కేసీఆర్‌కు ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకునే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. “నా క్యారెక్టర్ ఏమిటో ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుసు, అయినా ఎందుకు తొందరపడి మాట్లాడారో తెలియదని ఆయన దగ్గరున్నంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు పంచుతాను” అని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావుకు తన నిజాయితీ తెలుసని చెప్పారు. “మా మంత్రులు వాటాలు పంచుకోవడం కాదు, ప్రజల కోసం చేయాలని అనుకుంటే ప్రభుత్వ ఖజానాలో బీఆర్ఎస్ ఏమి మిగిల్చింది? దొంగలు మీరైతే నిందలు మా మీద వేస్తారా?” అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఎవరి ప్రైవేట్ కంపెనీగా మార్చబోమని స్పష్టం చేశారు.కేసీఆర్ కుటుంబాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. “కేసీఆర్ కుటుంబం అవినీతికి ప్రొఫెసర్లు. ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుని సజ్జనుల్లా మాట్లాడుతున్నారు. అలీబాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి తేడా లేదు” అని ఆరోపించారు. ఈ ‘దొంగల్లో’ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారని విమర్శించారు.
0 Comments