తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ భేటీ అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ, గువ్వల బాలరాజు ఈ నెల 11న అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రకటించారు. గత ఆగస్టు 2న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేసీఆర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తాను ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని, సుమారు 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుడిలా పనిచేశానని ఆయన గుర్తుచేశారు. అధినేత కేసీఆర్ నుంచి రాజకీయాలు నేర్చుకున్నానని, తన ఎదుగుదలకు, ప్రజాసేవ చేసే అవకాశమిచ్చిన బీఆర్ఎస్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు . మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని కానీ కొందరు కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చిన తర్వాతే తాను రాజీనామా చేశానని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.ఇంకా ఏ పార్టీలో చేరాలన్నది అప్పటివరకు నిర్ణయించుకోలేదని, కాంగ్రెస్ సహా అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నియోజకవర్గానికి చెందిన వారేనని పేర్కొన్నారు .జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వంలో నడవడం నాకు ఇష్టమని ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలుసుకొని ఆ పార్టీలో చేరతానని చెప్పానని అయన సానుకూలంగా స్పందించారని గువ్వల తెలిపారు.
0 Comments