- కేసీఆర్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్
- టైం , ప్లేస్ చెప్పాలి అని సవాల్
- కాంగ్రెస్ , బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శ
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు రక్షణ కల్పించుకుంటూ, పరస్పరం అవినీతి కాపాడుకునే రాజకీయాలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. “నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష” అన్నట్లుగా ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయని, ఈ అనుబంధం వల్లే రాష్ట్రం నష్టపోతోందని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒకరినీ అరెస్ట్ చేయలేదని, ఇది వారి మధ్య ఉన్న రాజకీయ సయోధ్యను సూచిస్తుందని అన్నారు.
నిందితుడు రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్‌లో మాజీ సీఎం కేసీఆర్ పేరు స్పష్టంగా ఉన్నప్పటికీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించాడనే ఆరోపణ చేస్తూ, ఏ దేవాలయానికైనా రమ్మన్నా, తన కుటుంబసభ్యులందరితో కలిసి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై కేటీఆర్ స్పందించాలని కూడా డిమాండ్ చేశారు.
అలాగే, బీఆర్ఎస్ సొంత నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని బండి సంజయ్ తెలిపారు. తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురిని మావోయిస్టు సింపతైజర్లుగా చూపించడం పూర్తిగా దారుణమని వ్యాఖ్యానించారు. ఈ చర్యలతో రాజకీయ ప్రత్యర్థులను కించపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ఇదే కాకుండా, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ వద్ద ఉన్న వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, వాటి మూలం ఏమిటో ప్రశ్నించారు. గతంలో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు, మహారాష్ట్ర ఎన్నికలకు కూడా డబ్బులు పంపారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు సిగ్గుంటే ఇప్పటికైనా ఆ పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
0 Comments